* అండవాతము - అండవృద్ధి - Hydrocele .
వృషణములలో రెండుగాని ఒకటికాని వాపు కలిగి ఉండుట పోటు కలిగియుండుట . వాత ప్రకోపం చేత పొత్తికడుపులో చెడునీరు పుట్టి అది క్రమముగా వృషణాలలోకి దిగి పెరిగెడి రోగం .
* అంతర్వ్రుద్ధి - Herniఆ .
వాతమును ప్రకోపింపచేయు పదార్దాలు అధికంగా భుజించుట వలన , మలమూత్ర వేగమును నిరోధించుట వలన , అతి బరువు మోయుట వలన వాతం ఎక్కువ అయ్యి సన్నపేగులో ఒక భాగం సంకోచింపచేసి తన స్థానం నుండి క్రిందికి వెడలి గజ్జ యందు చేరి గ్రంథిగా రూపం పొంది వాపును కలిగించు రోగం
* అగ్నిమాంద్యం -
జఠరాగ్ని మందం అయ్యి ఆకలి లేకుండా ఉండుట .
* అతిమూత్రము -
శరీరంలో మేహం అధికం అయ్యి మూత్రం విస్తారంగా పొయ్యే రోగం .
* అతిసారం -
అమితముగా , వికృతముగా విరేచనములు అయ్యే రోగం .
* అనాహం -
మూత్రం బంధించబడి కడుపు ఉబ్బే రోగము .
* అపస్మారం - Hysteria .
స్మృతి లేక నోటి వెంట నురుగు పడటం మొదలగు చిహ్నాలు గల రోగం . మరియు స్త్రీలకు వచ్చెడి కాకిసోమాల అనే మూర్ఛరోగం .
* అభిఘాత జ్వరం -
కర్రలు , రాళ్లు మొదలగు వాటితో దెబ్బలు తగులుట చేత , మన శరీర సామర్ధ్యం కంటే అధికంగా పనిచేయుట వలన , అతిగా దూరం నడుచుట వలన వచ్చెడి జ్వరం .
* అశ్మరీ రోగం - Blader Stones .
మూత్రకోశము నందు రాళ్లు పుట్టుట వలన మూత్రము వెడలుట కష్టం అగు రోగము
* అస్థిగత జ్వరం -
శరీరం నందు ఎల్లప్పుడూ ఉంటూ దేహమును క్షీణింపజేయు జ్వరం.
* అస్రుగ్ధము - Leucorrhoea .
కుసుమరోగము అని కూడా అంటారు . యోని వెంట తెల్లగానైనా , ఎర్రగానైనా , పచ్చగానైనా , నల్లగానైనా జిగటగా నీరు స్రవించెడి రోగము .
* ఆమము -
భుజించెడి పదార్దాలు జీర్ణముగాని కారణంబున గర్భమున జిగురు కలిగి తెల్లగా , బిళ్లలుగా ఘనీభవించెడి దుష్ట జలము.
* ఆమాతిసారము - Dysentery .
ఆమమే విరేచనమయ్యే రోగము . దీనినే జిగట విరేచనాలు అని , ఆమ విరేచనాలు అని అంటారు.
* ఆర్శరోగము - PILES .
మూలవ్యాధి అని అంటారు. గుద స్థానం న లోపల కాని , వెలుపల గాని మాంసపు మొలకలు జనియించి రక్తము స్రవించుచు గాని స్రవించక గాని నొప్పిని కలిగించు రోగము .
* ఆహిక జ్వరం - Intermittent fever .
దినము విడిచి దినము లేక మూడు దినములకు ఒకసారి కాని అప్పుడప్పుడు కనిపించే జ్వరం .
* ఉదర రోగము - Ascites .
శరీరం కృశించుట , తెల్లబారుట , కడుపులో దుష్టపు నీరు చేరి ఉదరము పెరుగుట మొదలగు చిహ్నములు గల రోగము
* ఊపిరిగొట్టు నొప్పి -
గాలి విడిచినప్పుడు గుండెలలో ఒకపక్క పోటు పొడిచినట్టు లేచేడి నొప్పి .
* ఎరుగు వాతము -
కాళ్ళు , చేతులు మొదలగు అవయవములు గాని దేహము అంతయు గాని ఎగురుచుండెడి ఒక విధమైన వాత రోగము .
* కరపాణి కురుపులు -
బిడ్డల యెక్క కాళ్ళమీద , చేతుల మీద దట్టముగా అయ్యేడి కురుపులు .
* కామిల రోగము - కామెర్లు - Jaundice .
కండ్లు , శరీరం , ఆకుపచ్చ లేక పసుపుపచ్చ వర్ణము కలిగి ఆకలి లేకుండా ఉండుట , దాహము , నీరసము మొదలగు లక్షణాలు కలిగి ఉండే రోగము .
తరువాతి పోస్టులో మరికొన్ని రోగములు మరియు వాటి లక్షణములు వివరిస్తాను.
No comments:
Post a Comment