Tuesday, February 14, 2017

తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం (1)

      " ఆహారమే " పరమ ఔషధంగా భావించే సంస్కృతి కలిగిన మన దేశంలో ప్రస్తుతం మనం తీసుకునే ఆహారం వలన మన దేహం ఎన్నో జబ్బులకు నిలయమవుతోంది. మానవుని శారీరక స్ధితిని తెలియ జేయునది ఆరోగ్యం. మనము మన సంప్రదాయ ఆహారాన్ని వదిలి పాశ్చాత్య ఆహారము తీసుకోవటము , మన సాంప్రదాయ ఆహారాన్ని తీసుకుంటున్నా కూడా వాటిని పాలిష్ చేసి కృత్రిమ , హానికరమైన రసాయనాలు , రంగులు కలిపి వాటిలోని పోషక విలువలన్నీ నిర్వీర్యం చేసి భుజిస్తున్నాము. దీని వలన మధుమేహం , గుండె జబ్బులు , క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నాము.

       ప్రస్తుతం యువత , మధ్యవయస్కులు , ముసలివారు , పిల్లలు , స్త్రీలు  పాశ్చాత్య ఆహార పోకడలకు పోయి ప్రాసెస్ చేసినటువంటి ఆహారం ముఖ్యంగా మైదాతో తయారు చేసిన పదార్ధాలు తీసుకోవటం వలన ఊబకాయం , త్వరగా వా‌ర్ధక్యం ( ముసలి తనం ) రావటం. తొందరగా అలసిపోవటం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు.

      మనం ఆహార రూపంలో తీసుకున్నది దేహంలో జీర్ణక్రియ అనంతరం భౌతిక , మానసిక శక్తిగా మార్పు చెందుతుంది. ఈ రసాయనిక చర్య ప్రకృతి నియమాలకు అనుగుణంగా జరిగినంత కాలం అంతా సహజంగానే గడిచింది. ఎపుడైతే మనం ప్రకృతి తల్లి మూలాలకు దూరంగా జరిగామో అక్కడ మన ఆరోగ్యం పతనం కావడం మొదలైంది. మానవజాతి ఆరోగ్యం అధఃపాతాళానికి పడిపోయింది క్రొత్త రుచులతో క్రొత్త రోగాలు పెరిగాయి.

      ప్రస్తుతం చాలా మందికి ఏమి కొంటున్నాం , ఏమి తింటున్నాం , ఎందుకు తింటున్నాం , ఎప్పుడు తింటున్నాం అనే అవగాహన గానీ , ఆలోచన గానీ ఏమాత్రం లేదు. మనం పీల్చే గాలి , త్రాగే నీరు , తినే తిండి ప్రతిదీ కలుషితమైనాయి. అయినా జంతువులకు రాని రోగాలు , మనకే ఎందుకు వస్తున్నాయి. జీవరాశులన్నీ ప్రస్తుత వాతావరణ పరిస్థితులను  తట్టుకొని ఆరోగ్యంగా జీవిస్తున్నాయి. కాని మానవుడు మాత్రమే ప్రకృతిలో జరిగే చిన్న చిన్న మార్పులకు కూడా తట్టకునే శక్తి లేక తల్లడిల్లి పోతున్నాడు. దీనికి అసలైన కారణం మన ప్రకృతి విరుద్ద ఆహార శైలి. మన పూర్వీకుల ఆహార విధానం , జీవనశైలి ప్రకృతితో జత కూడి ఉండెడిది. ప్రస్తుతం మన ఆహారశైలి , జీవనశైలి మొదలగునవి  అన్నియు ప్రకృతి విరుద్ధంగా ఉన్నాయి.

      మనం తింటున్న ఆహార  పదార్ధాలు మన ఆరోగ్యానికి ఎంత వరకు ఉపయోగ పడుతున్నాయో పట్టించుకునే పరిస్ధితుల్లో లేనందు వలనే , ఎన్నో సంస్ధలు అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలు మన ద్వారా భుజింప చేస్తూ ఆర్ధికంగా లాభపడుతున్నాయి. నాగరికత పెరిగిన తరువాత పిజ్జాలు , సమోసాలు మొదలగునవి అలవాటు చేసుకొని రసహీనమైన ఆహారం తింటున్నాం. రోగాల పాలవుతున్నాం.  ఎక్కువ కాలం బతకడం కన్నా ఎక్కువ ఆరోగ్యంతో బతకడం అనేది అవశ్యకమని ఇపుడిపుడే అందరికీ అర్ధమవుతుంది.

      వరి , గోధమలు కనిపెట్టక ముందే చిరుధాన్యాలు వాడి మన పెద్దవాళ్ళు చాలా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపారు. ప్రస్తుతం మనం కేవలం వరి , గోధుమలకే ప్రాముఖ్యతనిస్తూ శరీరానికి ఎంతో మేలు చేసే అన్ని వయసుల వారికి శారీరకంగా , మానసీకంగా ఆరోగ్యానిచ్చే చిరుధాన్యాల గురించి మర్చిపోయాం. 

      మంచి ఆహారపు అలవాట్లే మనిషి ఆరోగ్య రహస్యం. ఎంతో పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను మర్చిపోయాం. తిరిగి మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి చిరుధాన్యాలను ఆశ్రయించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. 

" చిరుధాన్యాలు సంపూర్ణ ఆహారం "

No comments:

Post a Comment